నియోజకవర్గాల పునర్విభజన అంశం.. కేంద్రంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం

  • తమిళనాడు గళాన్ని పట్టించుకోకుంటే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక
  • పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపణ
  • డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణాది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వెల్లడి
  • బిల్లును వ్యతిరేకిస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన
నియోజకవర్గాల పునర్విభజన అంశంలో తమిళనాడు అభిప్రాయాలను పట్టించుకోకపోతే బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆయన 'ఎక్స్' వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన పేరుతో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

దేశాభివృద్ధికి కృషి చేసినందుకు గాను కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో రేపు కేంద్రం ప్రవేశపెట్టాలని చూస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణాదికి చెందిన వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

కేంద్రం ప్రవేశపెట్టాలని చూస్తోన్న బిల్లును వ్యతిరేకిస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్విభజనను తాము ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని స్టాలిన్ పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కుట్రపూరిత చర్యగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో పార్లమెంటులో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Stalin
MK Stalin
Tamil Nadu
Delimitation
Constituency delimitation
BJP
Southern States
Parliament

More Telugu News